కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో వీలు దొరికినప్పుడల్లా కొత్త జిల్లాల కూర్పుపైనే సీఎం ప్రత్యేకంగా చర్చిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే క్రమంలో గురువారం రాత్రి కూడా సీనియర్ అధికారులతో దాదాపు మూడు గంటలకుపైగా సీఎం చర్చించినట్లు సమాచారం. అధికారులు క్రోడీకరించిన అంశాలు, సీఎం కేసీఆర్ ఇప్పటికే సేకరించి తన వద్ద పెట్టుకున్న సమాచారం ఆధారంగా దాదాపు 21 జిల్లాలపై స్పష్టతకు వచ్చినట్టు తెలిసింది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండలను రెండేసి జిల్లాలుగా, మెదక్, మహబూబ్నగర్, వరంగల్, కరీంనగర్లను మూడేసి జిల్లాలుగా ఏర్పాటుచేయడంతోపాటు వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది.