శ్రీరాముడి దాసుడిగా, అపర రామ భక్తుడిగా పేరుగాంచిన శ్రీ ఆంజనేయ స్వామి, కొండగట్టు అంజన్నగా కరీంనగర్ జిల్లా, ముత్యంపేట గ్రామంలో వెలిసాడు. కొండగట్టు అంజన్న దేవాలయం కరీంనగర్ జిల్లా కేంద్రానికి సుమారు 35 కిమీ దూరంలో మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో కొలువై వుంది.
ఆలయ చరిత్ర
దాదాపు ఐదు వందల ఏళ్ల క్రితం కొడిమ్యాల పరగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టల్లో తన పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. వెతికి వేసారిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి స్వప్నంలో కనిపించి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాననుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. కళ్లు తెరిచి చూడగా ఆవు కనిపించడంతో సంజీవుని ఆనందానికి అవధుల్లేవు. భక్తిభావంతో కోరంద ముళ్లపొదలను తొలగించి స్వామివారికి చిన్న ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. నారసింహ వక్త్రంతో వెలసిన కొండగట్టు అంజన్న ఆలయానికి ఈశాన్యభాగంలోని గుహల్లో మునులు తపస్సు ఆచరించినట్లు ఆనవాళ్లున్నాయి. శ్రీరాముడు సీతకోసం లంకకు వెళ్లే సమయంలో లక్ష్మణుడు మూర్చిల్లిపోగా ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వస్తుండగా అందులోంచి ఓ ముక్కరాలిపడి కొండగట్టుగా ప్రసిద్ధి పొందిందని మరికొందరు పురాణగాథను చెబుతుంటారు. ఆలయానికి వెళ్లే దారిపక్కన సీతాదేవి ఏడ్చినట్లు చెప్పే కన్నీటి గుంతలు భక్తులకు దర్శనమిస్తాయి. ప్రకృతి సిద్ధంగా వెలసిన పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. రోగగ్రస్థులు, సంతానహీనులు అంజన్న సన్నిధిలో 41రోజులు గడిపితే బాగవుతారని భక్తుల విశ్వాసం.
![]() |
శ్రీకొండగట్టు అంజన్న దేవాలయం |
ఆలయంలో జరిగే ఉత్సవాలు..
ఇక్కడి నియమాలు పూజలు పాంచరాత్ర ఆగమ శాస్త్రాలను అనుసరించి అమలుచేస్తారు. చాతుర్ధ శ్రీ వైష్ణవ అర్చకుల ద్వారా అర్చనలు నిర్వహిస్తారు. నిత్యాభిషేకాలు, ఆరాధనోత్సవాలు, వ్రతాలు, హోమాలు, హనుమాన్ చాలీసా పఠనాలు, శ్రీరామనవమి ఉత్సవాలు, ధనుర్మాసమహోత్సవాలు, కృష్ణాష్టమి, హనుమాన్ జయంతి వంటి పండుగలు ఇక్కడ అత్యంత ఘనంగ నిర్వహిస్తారు.. ఇక్కడ ప్రత్యేకంగ 5రోజులు హనుమాన్ జయంతి రోజులు నిర్వహిస్తారు. అలాగే ప్రపంచ శాంతికోసం జగత్కళ్యాణ సిద్ధికి ప్రతి సంవత్సరం మూడు రోజులపాటు శ్రీసుదర్శన మహాయాగం జరుపుతారు. అంతేకాకుండా ఎంతోమంది పుణ్యమార్గంలో, ధర్మ మార్గంలో నడవడానికి హనుమాన్ మాల ధరిస్తారు. 40రోజులు అత్యంత భక్తి ప్రపత్తులతోగడిపిన స్వాములందరు వారి ఇరుముడిని తలపై ఎత్తుకొని “కొండగట్టు” దేవస్థానంలో మాల విరమణ చేయడం సాంప్రదాయం. దర్శించిన వారందరికి అపూర్వ భక్తి పారవశ్యాన్ని అందించి, కోరికలను తీరుస్తు, వరాలను అందించే కల్పతరువుగా ఈ దేవాలయం ప్రసిద్ది చెందింది.
ఆలయానికి ఇలా చేరుకోవచ్చు...
కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి జగిత్యాల్ కి వెళ్ళేదారిలో ఆలయానికి చేరుకోవచ్చు.
కామారెడ్డి నుండి ప్రతి 30 నిమిషాలకి కరీంనగర్ కి వెళ్ళే బస్సులో వేములవాడ చేరుకొని అక్కడి నుండి వేరే బస్సులో ఆలయానికి చేరుకోవచ్చు.