కామారెడ్డి పట్టణంలో వినాయక చవితి వేడుకలు నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణలోనే ఘనంగా జరుగుతాయంటే అతియోశక్తి లేదు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చిందంటే చాలు మన కామారెడ్డి పట్టణ వీధులు భక్తి పారవశ్యంతో నిండిపోతాయి. ప్రతి సంవత్సరం వివిధ గణేష్ మండలిలు తమదైన శైలిలో సరికొత్త భారీ సెట్టింగ్ లతో భక్తులను ఆకర్షించేలా ఏర్పాటు చేస్తారు.
ఈ సంవత్సరం కామారెడ్డి గాంధీ గంజ్ లో ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం సెట్ ప్రజలను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ సెట్టింగ్ లో భాగంగా ఏడు ద్వారాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఏడు ద్వారాల ద్వారా వెళ్ళి శ్రీ వేంకటేశ్వరుడి రూపంలో వున్న శ్రీ మహా గణపతి ని దర్శించుకోవచ్చు. కామారెడ్డి రైల్వే స్టేషన్ వద్ద యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాకతీయుల కళాతోరణం సెట్ కూడా భక్తులను ఏంతో ఆకర్షిస్తోంది. శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇరవై ఫీట్ల మట్టి గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే ఫ్రెండ్స్ యూత్ క్లబ్, నెహ్రు ఆదర్శ సంఘం, వైష్ణవి ఆదర్శ సంఘం, పద్మశాలి సంఘం మరియు హిందూ సేన ఇలా ఒకటి కాదు రెండుకాదు చెప్పుకుంటూ పోతే చాలా గణేష్ విగ్రహాలు, వారి వారి సెట్టింగులు ప్రజలను అమితంగా ఆకర్షిస్తున్నాయి.