ప్రధాని నరేంద్రమోడీ 500 మరియు 1000 రూపాయల నోట్లను నిషేదిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నల్ల ధనం వున్న వ్యక్తులలో భయం మొదలైతే మధ్యతరగతి ప్రజలలో అనేక సందేహాలు మొదలయ్యాయి.
- మీ దగ్గరున్న పాత 500, 1000 నోట్లను నవంబరు 10 నుంచి డిసెంబరు 30 దాకా బ్యాంకుల్లో గానీ, పోస్టాఫీసుల్లో గానీ జమ చేసుకోవచ్చు.. నేరుగా ఖాతాల్లోకి వేసుకోవడమే. అంటే ప్రతీ పెద్ద నోటు ఐటీ చూపులు, నిఘా పరిధిలోకి వస్తుందన్నమాట.. భారీ మొత్తాలున్నా సరే, ఖాతాలోకి వేసేసి, తరువాత ఆడిటింగ్ చిక్కులు చూసుకోవచ్చులే అనుకుంటే మీ ఇష్టం. చిన్నా చితకా అమౌంట్లకు మాత్రం పెద్దగా ఇబ్బంది ఉండదు.
- డిసెంబరు ఆఖరులోగా ఇలా పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమచేయలేనివారు, వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకూ.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఆర్బీఐ కౌంటర్లలో మాత్రమే వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ డబ్బుకు సంబంధించిన డిక్లరేషన్ నిర్ణత ఫారమ్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అది తదుపరి ఆడిటింగ్ కు ఐటీకి ఉపకరిస్తుందన్నమాట.
- ఇప్పుడైతే రోజుకు 10 వేలు, వారికి 20 వేలు మాత్రమే బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవటానికి వీలుంటుందని ప్రధాని చెప్పాడు. కానీ దీనిపై క్లారిటీ రావల్సి ఉంది. పెద్ద మొత్తాల్లో డబ్బు అవసరమున్నవారు తప్పనిసరిగా ఇక నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెక్కులపై మాత్రమే ఆధారపడాలి.. నగదు చెల్లించాల్సిన చోట్ల కష్టమే.. అయితే ఈ పరిమితిని ఇంకొంత పెంచే వీలుందని అంటున్నారు.
- ప్రభుత్వం 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెడుతున్నది. బ్యాంకులకు, పోస్టాఫీసులకు వెళ్లి, చెల్లుబాటయ్యే ఐడీ కార్డును చూపించి, మీ దగ్గరున్న పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చుకోవటానికి వీలుంటుంది. అయితే ఇంత భారీ సంఖ్యలో కొత్త నోట్లు ముద్రించారా? ఇంత వేగంగా మూలమూలకూ ఉన్న బ్యాంకులు, పోస్టాఫీసులకు చేరతాయా? ఆ ఏర్పాట్లు ఆల్ రెడీ చేసేశారా? క్లారిటీ లేదు. బహుశా 9, 10 తేదీల్లో అధికారులు ఇంకాస్త స్పష్టత ఇవ్వవచ్చు.
- అత్యవసర పరిస్థితుల్లో ఈ ఆంక్షలు ఇబ్బందిగా మారకుండా నవంబర్ 12 వరకూ ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో ఈ పాత నోట్లు చెల్లుబాటు అవుతాయి. ఆ తరువాతయినా చిక్కులు ఏర్పడే వీలుంది. ఎందుకంటే కావల్సినంత నగదు బ్యాంకులో ఉన్నా డ్రా చేయడం వీలు కాదు. డెబిట్ కార్డులు, చెక్కులను వాడాల్సిందే. ఒకవేళ వేరే వాళ్ల వద్ద అప్పు లేదా చేబదులు తీసుకోవాలనుకున్నా చిక్కులే. ఎవరి వద్దా అంత లిక్విడ్ క్యాష్ ఉండకపోవచ్చు...
- దేశంలో వచ్చేవారికి, దేశం వదలి వెళ్లేవారికి అసౌకర్యంగా ఉండకుండా ఎయిర్ పోర్టుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి అది పెద్ద సమస్యగా మారకపోవచ్చు.
- పెట్రోలు బంకుల్లో నవంబరు 12 వరకూ పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. కానీ 8వ తేదీ రాత్రి నుంచే బంకుల్లో పాత నోట్లను తీసుకోవడం నిలిపేశారు. సో, అదీ చిక్కే. ఎందుకంటే అప్పటివరకూ 500, 1000 రూపాయల పాత నోట్లు తీసుకుంటే వాటి లెక్క, వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందట. అందుకని తీసుకోవడమే మానేశారు. మాకెందుకొచ్చిన తిప్పలు అనుకుంటారు కదా..
- 9, 10 తేదీల్లో ఏటీఎంలు పనిచేయవు. అత్యవసరాలు ఏమైనా ఉంటే అక్కడిక్కడా చేబదళ్లు తప్పవు. పాత పెద్ద నోట్లు ఉన్నా ఎక్కడా చెల్లవు. ప్రతీ అవసరానికీ డెబిట్ కార్డు, చెక్కులు వాడలేరు కదా. అదీ ఇబ్బందిగా మారే ప్రమాదముంది.