Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks
Showing posts with label Devotional. Show all posts
Showing posts with label Devotional. Show all posts

Saturday, September 03, 2016

Mana Kamareddy

వినాయక చవితి రోజు పూజలో ఉపయోగించే పత్రాలు వాటి ఔషధ గుణాలు..


వినాయక చవితి పర్వదినంనాడు గణనాయకుడికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. వినాయకుడి పూజలో 21 రకాల పత్రాలను వినియోగిస్తారు. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారు చేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచటంతో పాటు అనారోగ్యాలను హరింపచేస్తుందని చెబుతారు. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు. నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడిపోయిన 48 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంతేకాక వాటిని 9 రోజుల అనంతరం నీటిలో నిమజ్జనం చేయడం వల్ల వాటి నుండి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిలోకి చేరి అక్కడి రోగకారక క్రిములను, చెడు పదార్థాలను నాశనం చేస్తాయి. ఆ నీటిలో ప్రాణవాయువు శాతాన్ని పెంచుతాయి. అంతేకాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. పత్రిని చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరంలోకి శోషణం చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి.

1. మాచీపత్రం (మాచిపత్రి) :- ఇది దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, చర్మ సంబంధమైన వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.

2. బృహతీ పత్రం(వాకుడాకు) : - ఇది దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులను, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి దోహదపడుతుంది.

3. బిల్వ పత్రం( మారేడు) :- ఇది జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

4. దూర్వాయుగ్మం(గరిక) :- ఇది గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, మొలల నివారణకు ఉపయోగపడుతుంది.

5. దత్తూర పత్రం(ఉమ్మెత్త) :- ఇది సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఋతు వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషం కావున కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి.

6. బదరీ పత్రం(రేగు) :- ఇది జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు రోగ నిరోధక శక్తి పెంపుదలకు సహాయపడుతుంది.

7. ఆపామార్గ పత్రం(ఉత్తరేణి) :- ఇది దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవి పోటు, రక్తం కారటం, మొలలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాలలో రాళ్ళు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

8. తులసీ పత్రం(తులసీ) :- ఇది దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్ను నొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది.

9. చూత పత్రం( మామిడాకు) :- ఇది రక్త విరోచనాలు, చర్మ వ్యాధులు, ఇంటిలోని క్రిమి కీటకాల నివారణకు దోహదపడుతుంది.

10. కరవీర పత్రం( గన్నేరు) :- ఇది కణుతులు, తేలు కాటు- విష కీటకాల కాట్లు, దురద, కళ్ళ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగించబడుతుంది.

11. విష్ణుక్రాంత పత్రం( విష్ణు కాంత) :- ఇది జ్వరం, కఫం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందింపజేయడానికి ఉపయోగపడుతుంది.

12. దాడిమీ పత్రం(దానిమ్మ) :- ఇది విరోచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, మొలలు, ముక్కు నుండి రక్తం కారడం, కండ్ల కలకలు, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

13. దేవదారు పత్రం(దేవదారు) :- ఇది అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

14. మరువక పత్రం(మరువం) :- ఇది జీర్ణశక్తి, ఆకలి పెంపొదించుటకు, జుట్టు రాలడం, చర్మ వ్యాధులు తగ్గించుటకు ఉపయోగపడుతుంది. దీనిని సువాసనకు ఉపయోగిస్తారు.

15. సింధూర పత్రం( వావిలి) :- ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, గాయాలు, చెవిపోటు, మూర్ఛ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

16. జాజీ పత్రం( జాజి ఆకు) :- ఇది వాత నొప్పులు, జీర్ణాశయ వ్యాధులు, మలాశయం వ్యాధులు, నోటి పూత, దుర్వాసన, కామెర్లు, చర్మ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

17. గండకీ పత్రం(దేవ కాంచనం) :- ఇది మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు. నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. దీని ఆకులు ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.

18. శమీ పత్రం(జమ్మి ఆకు) :- ఇది కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధులు నివారించడానికి ఉపయోగపడుతుంది.

19. అశ్వత్థ పత్రం ( రావి ఆకు) :- ఇది మల బద్ధకం, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు నివారించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి సహకరిస్తుంది.

20. అర్జున పత్రం( తెల్ల మద్ది) :- ఇది చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.

21. ఆర్క పత్రం( జిల్లేడు) :- ఇది చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ళ నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు , వ్రణాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.


Read More

Monday, July 27, 2015

Mana Kamareddy

తొలి ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే!!


మన భరతభూమి పుణ్య భూమి. భక్తికి, భక్తి తత్వానికి పుట్టినిల్లు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు, మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో, ఏకాదశి వొకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం మన ఆచారంగా వ్యవహరింపబడుతోంది.

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి'' అని కూడా అంటారు. ఈ రోజు నుండి శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతే గాక చాతుర్మాస్య వ్రతంకూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.


మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు(24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు సంవత్సరాల కొక సార అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవైఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాము.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థము. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో వివరించబడిన సంగతి విదితమే.
అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొనబడింది.
తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, సంకల్పం వలన తన శరీరము నుంచి ఒక కన్యకను జనింపజేసినట్లు ఆమెనే "ఏకాదశి" అనీ, ఆమె మూడు వరాలు...

  • సదా మీకు ప్రియముగా ఉండాలి.
  • అన్ని తిధులలోను ప్రముఖంగా ఉండి అందరిచే పూజింపబడాలి.
  • నా తిధి యందు భక్తితో పూజించి ఉపవాసము చేసిన వారికి మోక్షము లభించాలి అని కోరినట్లు ఎన్నో పురాణ కథలు చెప్పబడి ఉన్నాయి.

మహా సాద్వీ అయిన సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందని సంతులీలామృత పురాణంలో చెప్పబడింది. అందువల్లనే, ఆ రోజు పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఐతే, అంతటి మహిమాన్వితమైన ఈ ఏకాదశి వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం.

ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు:

  • దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.
  • ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
  • అసత్య మాడరాదు.
  • స్త్రీ సాంగత్యం పనికి రాదు.
  • కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
  • ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.
  • మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.

ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే :
విష్ణువు వరం వలన అన్నంలో దాగిన పాప పురుషుడే గాక, బ్రహ్మ పాలభాగము నుంచి క్రిందబడిన చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటీయమని అడిగినప్పుడు, బ్రహ్మ ఏకాదశినాడు భుజించు వారి అన్నములో నివసించమని వరమీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు గనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక" మన పురాణాలు పరోక్షంగా వెల్లడిస్తున్నాయి. అందువలన ముఖ్యంగా ఉపవసించాలని చెప్పబడింది.


సైన్సు పరంగా మరికొన్ని సూచనలు తెలుసుకుందాం. అందుకే వారి వారి వయసును బట్టి పళ్ళు పాలు పలహారములు తీసుకొనవచ్చును (అన్నం తప్ప). అంతే గాక అనేక ఆరోగ్య రహస్యములు ఇమిడి ఉన్నాయట. "లంఖణం పరమౌషధం" అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఉపవాసం వల్ల జీర్ణ కోశములు పరిశుద్ధ మౌతాయి. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. మనస్సునీ, శరీరాన్నీ పరిశుద్ధం చేస్తుంది. ఈ విధంగా సైన్సు పరంగానూ, పౌరాణికంగానూ అనేక ఫలితాలనిస్తుందని పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి.

ఈ వ్రతం చేసుకున్నవారికి సూర్య చంద్ర గ్రహణములలో భూరి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి.
Credit: Chaganti Koteshwara Rao


Read More