ఈ మధ్యే కూతురు పెళ్ళిచేసి ఆనందంలో ఉన్న ఆ తల్లిదండ్రుల ఆనందం, అప్పుడప్పుడే కొత్త జీవితం ప్రారంభించిన భర్త ఆశలు అడియాశలు చేస్తూ
విధి వక్రించి ఆమె దేవుడి దగ్గరకు వెళ్ళింది. ఆమె వెళ్తూ వెళ్తూ మరో నలుగురికి కొత్త జీవితం ప్రసాదించి మరి వెళ్ళిన హృదయ విదారకమైన సంఘటన కామారెడ్డిలో జరిగింది.
కామారెడ్డి పట్టణానికి చెందిన గరిపల్లి కృష్ణమూర్తి, కన్యాకుమారిల రెండో కూతురైన మాధురి లక్ష్మి, హైదరాబాద్ లో, టిసిఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. గత నెలలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడితో, మాధురి లక్ష్మి వివాహం జరిగింది. వివాహం తర్వాత వారు హైదరాబాద్ లో నివాసం వుంటూ ఉద్యోగం చేస్తున్నారు. గత నెలలో కూతురుని కామారెడ్డి తీసుకురావడానికి వెళ్ళిన కృష్ణమూర్తి దంపతులు, కామారెడ్డి కి చెందిన అర్ బి శేఖర్ లు జూన్ 25 నాడు వేకువ జామున మాధురి లక్ష్మిని తీసుకోని కారులో వస్తున్నారు. దురదృష్టవశాత్తు భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో అర్ బి శేఖర్ చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మాధురి లక్ష్మి హైదరాబాద్ లో కిమ్స్ లో చికిత్స పొందుతోంది .మాధురి లక్ష్మి తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త మెరుగవటంతో వారు డిశ్చార్జ్ అయ్యారు. చికిత్సపొందుతున్న మాధురి శనివారం బ్రెయిన్ డెడ్ కావటంతో జీవదాన్ ట్రస్ట్ వారు మాధురి తల్లిదండ్రులకు, భర్తకు మరియు అత్తమామలకు అవయవ దానం గురించి వివరించారు. పెద్ద మనసుతో వారు అంగీకరించటంతో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో మాధురి లక్ష్మి రెండు గుండె కావటాలను, రెండు కిడ్నిలతో పాటు లివర్ ని సేకరించి అవసరమున్న నలుగురికి అమర్చి వారికి కొత్త జీవితం ప్రసాదించారు. ప్రమాదంలో కళ్ళు దెబ్బతినటంతో సేకరించలేకపోయారు.
మాధురి లక్ష్మి తను తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతూ, నలుగురికి కొత్త జీవితం ప్రసాదించి మరి వెళ్ళిపోయింది. అవయవ దానానికి సమ్మతించిన మాధురి తల్లిదండ్రులకి, భర్తకు మరియు అత్తమామలు నిజంగా అభినందనీయులు. నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన మాధురి లక్ష్మి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. మాధురి లక్ష్మి కుటుంబాన్ని స్పూర్తిగా తీసుకోని అవయవ దానం ఆవశ్యకతను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ
- మన కామారెడ్డి