తెలంగాణా రాష్ట్రంలో నూతనంగా పది జిల్లాలను ఏర్పాటు చేయటానికి రాష్ట్ర కాబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణా జిల్లాల విభజన చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమౌతోంది. దీనిలో భాగంగా సిఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటిని కుడా ఏర్పాటు చేసింది. మొదటి విడుతలో పది జిల్లాలను ఏర్పాటు చేయటానికి రంగం సిద్దమైంది. మీడియాకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మొదటి జాబితాలో కామారెడ్డి జిల్లా పేరు వుంటుందో లేదో అనే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. సహజంగానే అందరు అనుకున్నట్లు ముఖ్యమంత్రి సొంత జిల్లాయిన మెదక్ జిల్లాను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
గత రెండు రోజులుగా మీడియాలో, కామారెడ్డి జిల్లా పై వస్తున్న రకరకాల ఊహాగానాలతో కామారెడ్డి ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటానికి సమయం కూడా తక్కువగా ఉన్నందున పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఏకతాటిపై వచ్చి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం ముందు గట్టిగా వినిపించవలసిన తక్షిణ అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.