సిద్ధరామేశ్వరో దేవ: సర్వ సిద్ధి ప్రదాయక:
స్మరంతు భక్తి భావేన సర్వ కామ్యార్థ సిద్దయే
సాక్షాత్తు ఆ పరమశివుడు దివి నుండి భువికి దిగివచ్చి పచ్చని ప్రకృతి మధ్య శ్రీ సిద్దరామేశ్వరుడుగా వెలసిన శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవస్థానం, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి రెండు కి.మీ. దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వస్వామి దేవస్థానం తర్వాత అంతటి ప్రాచుర్యం వున్న దేవస్థానంగా శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవస్థానం వెలుగొందుతోంది.ఆలయ చరిత్ర..
భిక్కనూరు స్థల పురాణం ప్రకారం సిద్దగిరి, రామగిరి అనే యతీశ్వరులు ఒకప్పుడు భిక్కనూరు ప్రాంతంలో నివసించేవారు. వారు తపస్సు చేసే ప్రాంతంలో ప్రతిరోజు ఒక ఆవు వచ్చిపుట్టలో పాల ధారలు కురిపించటాన్ని ఆ ఋషులు గమనించారు. ఆ పుట్ట దగ్గర తపస్సు చేయాగ, పరమేశ్వరుడు ప్రత్యక్షమై, పుట్టలో తన లింగాకృతి ఉందని తనకి ఆలయం నిర్మించి, నిత్య పూజాధి కైంకర్యాలు జరిగేలా చూడమని ఆదేశించి తాళపత్ర గ్రంథాన్ని కానుకగా ఇచ్చెను. ఆ తాళపత్ర గ్రంథ ప్రభావం వలన అతి తక్కువకాలంలోనే ఆలయం నిర్మించటానికి అవసరమైన ద్రవ్యం సమకూరిందని చెబుతారు. ఈశ్వరుడి కృపతో వెలసిన ఆలయం కనుక సిద్దగిరి, రామగిరి మునుల పేరు పై ఈశ్వరుడు స్వయంభూలింగాకారంలో శ్రీ సిద్దరామేశ్వర స్వామిగా అవతరించాడు.గర్భాలయంలో శ్రీ సిద్దరామేశ్వర స్వామి నెలకొని వున్న పానవట్టం విలక్షణంగా ఉంటుంది. సాధారణంగా శివలింగం యొక్క పానవట్టం ఉత్తర భాగాన ఉంటుంది కాని ఈ ఆలయంలో పానవట్టం తూర్పు వైపున ఉండటం విశేషం. శివలింగం వెనక భాగాన సమున్నత పీఠంపై శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి పంచాలోహ విగ్రహం ఉంటుంది. స్వామి వారికి ఇరువైపులా సిద్దగిరి, రామగిరి ల విగ్రహాలు ఉంటాయి. గర్భాలయం ముందు పరమేశ్వరుని వాహనం నంది ఎంతో అందంగా వుండటంతోపాటు, కుడి వైపున గణపతి విగ్రహం ఉంటుంది. ప్రధాన ఆలయ ఆవరణలో అనేక దేవతామూర్తుల ఆలయాలు ఉంటాయి. ప్రధాన ఆలయానికి కుడి వైపున శ్రీ భువనేశ్వరి మాత ఆలయం ఉంటుంది. ఆ ప్రక్కన శ్రీ వీరభద్రుని ఆలయం, శ్రీ కూమార స్వామి ఆలయం, శ్రీ దత్తాత్రేయుడి ఆలయంతో పాటు శ్రీ కాలభైరవ స్వామి మొదలగు దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించటానికి వ్రత మంటపం వుంటుంది.
శ్రీ సిద్దరామేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే వున్న మూల బావి ఎంతో పవిత్రమైనదిగా, సర్వరోగ నివారిణిగా విలసిల్లుతోంది. ఈ బావిని స్వయంగా సిద్దగిరి, రామగిరులు తమ స్వహస్తాలతో త్రవ్వారని చెబుతారు. ఆలయ గాలిగోపురానికి ఎడమ వైపున నవగ్రహా ఆలయం, హోమశాల ఉంటుంది. ఆలయం వెలుపల రావి చెట్టు క్రింద శ్రీ సుబ్రమణ్య స్వామి వారు ఉంటారు. ఆలయానికి ముందు భాగాన పవిత్ర కోనేరుతో పాటు, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, అతి సమీపంలో శ్రీ హరిహర అయ్యప్పస్వామి దేవాలయం, క్షేత్రపాలకుడు శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయం ఉంటాయి.
స్వామి వారి బ్రహ్మోత్సవాలు..
శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గున మాసం, బహుళ పక్షంలో (మార్చి నెలలో) ఐదు రోజుల పాటు, ఆలయ మహంత్ (పీఠాధిపతి), అర్చక బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి కళ్యాణం, విమానరథోత్సవం, అగ్ని గుండాలు, సిద్దగిరి, రామగిరి ఋషుల సమాధుల వద్ద పూజాధికములు మొదలగు కార్యక్రమాలు కన్నులపండుగగా జరుగుతాయి. అలాగే ప్రతి మాస శివరాత్రి , మహా శివరాత్రి పర్వదినం నాడు ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరుగుతాయి.ఆలయం వద్ద కల సౌకర్యాలు:
భక్తుల సౌకర్యార్థం శ్రీ సిద్దరామేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో, దాత సహకారంతో నిర్మించిన భవనాలలో గదులు అద్దెకు లభిస్తాయి. ఆలయానికి సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపంతో పాటు ఆర్య వైశ్య సత్రం కూడా ఉంది.
ఆలయానికి వెళ్ళే దారిలో వున్న ఇతర ఆలయాలు:
శ్రీ సిద్దరామేశ్వర స్వామి వారి దేవస్థాన స్వాగత తోరణం నుండి ఆలయానికి వెళ్ళే దారిలో శ్రీ పెద్దమ్మ ఆలయం, శ్రీ రేణుక దేవి(ఎల్లమ్మ) ఆలయం, ఇతర గ్రామ దేవతల ఆలయాలతో పాటు శ్రీ ప్రసాన్నంజనేయ స్వామి ఆలయం, శ్రీ హరిహర అయ్యప్పస్వామి ఆలయం మరియు ఆలయానికి కొంత దూరంలో కొండల మధ్య శ్రీ పెరుమాండ్లు స్వామి వారి ఆలయం ఉంటుంది.ఆలయానికి ఇలా చేరుకోవచ్చు...
హైదరాబాద్ నుండి నిజామాబాదు వెళ్ళే దారిలో భిక్కనూరు మండల కేంద్రంలో దిగి ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే కామారెడ్డి బస్ స్టాండ్ నుండి భిక్కనూరు వెళ్ళటానికి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో వుంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మన్మాడ్ వెళ్ళే రైలు మార్గంలో భిక్కనూరురైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడి నుండి ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు.
గూగుల్ మ్యాప్ లో..
ఫోటోలు:
