కామారెడ్డి ప్రాంత ప్రజలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 19 మండలాలతో కామారెడ్డి జిల్లా ఏర్పడనుంది. కొత్తగా బాన్సువాడ రెవిన్యూ డివిజన్‌తోపాటు, రెండు కొత్త మండలాలు ఏర్పడనున్నాయి. మొదటి గెజిట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత అభిప్రాయాలను, అభ్యంతరాలను వెల్లడించటానికి ప్రభుత్వం నెలరోజుల గడువు విధించింది. వెచ్చే దసరా పండగ తర్వాత అధికారికంగా కామారెడ్డి జిల్లాలో అధికారికంగా కార్యకలాపాలు జరుగనున్నాయి.
కొత్తగా ఏర్పడనున్న రెవెన్యూ డివిజన్ బాన్సువాడ స్వరూపం..
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు మండలాలైన బీర్కూర్, బాన్సువాడతోపాటు జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలైన పిట్లం, జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, నిజాంసాగర్‌లను కలిపి ఏడు మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా బాన్సువాడ ఏర్పడనుండి. బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో ఉన్న వర్ని, కోటగిరి మండలాలతోపాటు కొత్తగా ఏర్పాటవుతున్న రుద్రూర్ మండలాన్ని కూడా బోధన్ రెవెన్యూ డివిజన్లో కలిపారు.
కామారెడ్డి రెవెన్యూ డివిజన్ స్వరూపం..
కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో మార్పు జరుగలేదు. గతంలో మాదిరిగానే కామారెడ్డి, ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజవర్గాలతో కలిపి కామారెడ్డి రెవెన్యూ డివిజన్ అలాగే ఉంది. రెవెన్యూ డివిజన్లో గతంలో కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, ఎల్లారెడ్డి, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట్, నాగిరెడ్డిపేట్ మండలాలు యథాతదంగా ఉన్నాయి. కొత్తగా రామారెడ్డి, రాజంపేట్ మండలాలు కూడా ఏర్పడ్డాయి. మొత్తం 12 మండలాలతో కామారెడ్డి రెవెన్యూ డివిజన్ కొలువుదీరనుంది.
కామారెడ్డి జిల్లాలోకొత్తగా ఏర్పడనున్న రెండు మండలాలు..
రాజంపేట్ మండలంలోకి భిక్కనూరు మండలంలోని ఐదు గ్రామాలతోపాటు తాడ్వాయి మండలంలోని ఆరుగొండ, కొండాపూర్, గుండారం, సిద్దాపూర్, దేవాయిపల్లి(ఐదు) గ్రామాలను చేర్చారు. మొత్తంమీద 16 గ్రామాలు ప్రస్తుతం ఉన్న మండలాల నుంచి వేరే మండలాల పరిధిలోకి మారాయి.