కామారెడ్డి జిల్లాలోని ఉగ్రవాయి, నగదు రహిత గ్రామంగా మారబోతోంది. నిన్నటి వరకు సాధారణ గ్రామంగా ఉన్న ఉగ్రవాయి… స్థానికుల నిర్ణయంతో స్మార్ట్ విలేజ్ గా మారబోతోంది. గ్రామాలను నగదు రహిత గ్రామాలుగా మార్చాలన్న అధికారుల నిర్ణయానికి అండగా నిలుస్తున్నారు స్థానికులు. ఊళ్లో సగానికిపైగా నిరక్ష్యరాస్యులే అయినా… సమిష్టి కృషితో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కృషిచేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న చిన్న గ్రామం కావటం, గ్రామంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉండటంతో ఈ గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా మార్చేందుకు ఎంపిక చేశారు అధికారులు. బ్యాంకు అకౌంట్లు లేని వారికి గత కొన్ని రోజులుగా ఖాతాలు ఇప్పిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో చిన్న వ్యాపారులందరికీ స్వైపింగ్ మెషిన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్ల వాడకంపై ట్రైనింగ్ కూడా ఇచ్చారు. దీంలోపాటు మొబైల్ బ్యాంకింగ్ పైనా యువకులు, గ్రామ సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చారు.
ఉగ్రవాయి గ్రామంలో ప్రస్తుతం ఉన్న అన్ని దుకాణాల్లో స్వైపింగ్ మిషన్లను అందుబాటులోకి తెస్తున్నామని చెబుతున్నారు అధికారులు. ఉగ్రవాయిని వందశాతం నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఇంటింటికీ తిరిగి బ్యాంకు ఖాతాలు అందించామని… త్వరలోనే తమ లక్ష్యం నెరవేరుతుందంటున్నారు.
ప్రభుత్వం, అధికారులు చేస్తున్న కృషికి తమవంతు సహకారం అందిస్తూ ముందుకు పోతున్నారు ఉగ్రవాయి గ్రామస్థులు. వీళ్ళు చేస్తున్న కృషి సఫలం కావాలని కోరుకుంటోంది మన కామారెడ్డి.