ఆకాశంలో నేడు ఒక అద్భుతం జరగబోతోంది. ఎప్పటిలా కాకుండా చంద్రుడు ఒక అరుదైన రూపంలో కనిపించనున్నాడు. ఈరోజు సాయంత్రం 6:21- 7:37, (జనవరి 31) చంద్రుడు సూపర్ బ్లూ బ్లడ్ మూన్ గా దర్శనమివ్వనున్నాడు.
ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి ?
1. సూపర్ మూన్
2. బ్లూ మూన్
3. బ్లడ్ మూన్ లాంటివి జరుగుతాయి.
1) సూపర్ మూన్ అంటే ఏమిటి ?
అంటే చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్య లో తిరుగుతూ ఉండటం వలన ఒకానొక సమయంలో భూమికి చాలా దగ్గరకు వస్తాడు. అందువలన చంద్రుని సైజు పెరిగి పెద్దది గా కనిపిస్తుంది. 31వతేదీన ఇలాగే చంద్రుని సైజు 14% పెద్దదిగా కనిపిస్తుంది. ఇలా పెద్ద గా కనిపించే చంద్రుని బింబాన్ని సూపర్ మూన్ అంటారు.
సూపర్ మూన్ రోజు ఇలా చంద్రుని సైజు పెరిగి కనిపిస్తుంది.(తెలుపు రంగు)
2) బ్లూ మూన్ అని ఎందుకు అంటారు ?
ఇందులో బ్లూ రంగు ఏమీ లేదు కానీ ఒకే నెలలో రెండు పౌర్ణమీ లు (Full moon) వస్తే దాన్ని శాస్త్ర వేత్తలు బ్లూ మూన్ గా పిలుస్తారు.
క్యాలెండర్ ని గమనిస్తే జనవరి 2వ తేదీన ఒకసారి పౌర్ణమి వచ్చిన విషయం, మళ్ళీ జనవరి 31వ తేదీన రెండవసారి పౌర్ణమి రావటమే.
3) చంద్రుడు బ్లడ్ మూన్ గా ఎలా మారుతాడు?
సంపూర్ణ చంద్ర గ్రహణం వలన చంద్రుని మీద డైరెక్ట్ గా సూర్య కిరణాలు పడక పోవటం వలన చంద్రుడు ప్రకాశవంతంగా, తెల్లగా ఉండడు. కానీ భూమి పై పడిన సూర్య కిరణాలు భూమి వాతావరణంలో ని ధూళి, తేమ వలన పరావర్తనం,వికిరణం చెంది వాటిలోని ఎరుపురంగులో కిరణాలు భూమి అంచులనుంచి పోయి చంద్రుని మీద పడతాయి కాబట్టి సంపూర్ణ చంద్ర గ్రహణం రోజు చంద్రుని బింబం ఎరుపు/ ఆరెంజ్/పసుపు రంగు లో కనిపిస్తుంది. అందుకే రక్తం రంగు లో కనిపిస్తుంది కాబట్టి బ్లడ్ మూన్ అని పేరుపెట్టారు. (ఇది రోజూ ఉదయం, సాయంత్రం మనకు సూర్యుడు ఇలాంటి రంగులో కనిపించే విషయం కు సమానం. రెంటికీ కారణం భూమి చుట్టూ ఉన్న వాతావరణం.)
4) ఇలాంటిది గతంలో ఎప్పుడు జరిగింది ?
ఇలాంటి ఖగోళ ఘట్టం, గతంలో 1866 సం.లో సంభవించింది. తిరిగి 151 సం.ల తర్వాత ఇపుడు, అంటే 31.01.2018 నాడు ఆ పరిస్థితి పునరావృతం ఔతుంది, కాబట్టి ప్రజలందరూ తప్పకుండ చూసి అనందించాలి.
5) ఎక్కడి నుంచి చూడవచ్చు:
*భవంతులు, చెట్లు, కొండలు లేని ప్రదేశంలో అయితే చంద్రుడి ని చూడవచ్చు.
*పాఠశాల, కళాశాల విద్యార్థులు మైదానాల్లో బృందం గా కలిసి చూడగలరు.
*ఇంకా స్పష్టంగా కనిపించాలంటే టెలిస్కోప్ ద్వారా చూస్తే ఎర్రని చంద్రుడిని ఎక్కువగా అస్వాదించగలరు.
గ్రహణాల మీద ఉన్న అపోహలు - వాస్తవాలు :
1) చంద్ర గ్రహణం చూడకూడదని అంటారు ఇది వాస్తవమా? ఒక వేళ చూస్తే, కళ్ళతో నేరుగా చూడవచ్చా?
కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలు/ ఉప గ్రహాలు మనిషి కి హాని చేస్తాయని భావించడం ఇది పూర్తిగా అవాస్తవం.
చంద్ర గ్రహణం సందర్భంగా ఏ ప్రమాదకర కిరణాలు వెలువడవు, కాబట్టి ఎలాంటి ఫిల్టర్లు (మన కంటికి అడ్డంబెట్టుకునే) అవసరం లేకుండానే.. మనం, మన మామూలు కంటితో సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు....
2) చంద్ర గ్రహణం సమయంలో ఆహార పదార్థాలను తినకుడదంటారు నిజమేనా? పదార్థాల లో గరక గడ్డి వేయడం వలన గ్రహణం ప్రభావం ఏమీ ఉండదని భావించడం, ఒక వేళ గరక వేయని పదార్థాలు బయట పారవేయడం. ఇది సరియైనదేనా ...?
నిజము కాదు...
ఆ సమయంలో అల్పాహారం, భోజనం తీసుకున్నా ఏమి అవ్వదు. ఇవి కేవలం భ్రమలు, మూఢ విశ్వాసము మాత్రమే అవుతుంది. నిజమే అని భావించేవారు మీ ఊరు/పట్టణం లోకి గ్రహణం సమయంలో వెళ్ళి హోటల్లో, మిఠాయి దుకాణా ల్లో , తోపుడు బండ్ల వద్ద ప్రజలు ఆహార పదార్థాలను తింటున్నారో లేదో గమనించండి.
ఎందుకంటే, ఉదాహరణకు హోటల్లో వండిన వంటకాలు మిఠాయి దుకాణాలలో తయారు చేసిన మిఠాయిలలో ఎవ్వరూ గరక గడ్డి వేయరు, వేయడం మర్చిపోయినా గ్రహణం ప్రభావం ఉంటుందని, చెడిపోయినవి అని చెత్తకుండీ లో వేయలేరు..... వేయరు కూడా.....
3) గ్రహణం సమయంలో బయట తిరిగితే శరీర అవయవాలు దెబ్బతింటాయని భావించవచ్చా?
భూమి మీద ఆధారపడి మనిషులు మాత్రమే నివసించడం లేదని గ్రహించాలి. జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాలు కూడా నివసిస్తున్నాయి.
అలాంటి చెడు ప్రభావాలు ఉంటే వాటి సంగతి ఏమిటో అలోచించండి.
గ్రహణం ప్రభావం ఉంటుంది అనుకునేవారు గ్రహణం సమయంలో మీకు తెలిసిన సమీప పట్టణం లోని షాప్ యజమాని కి పోన్ చేసి బజారులో మనుషులు తిరుగుతున్నారా? లేదా కనుక్కోవటం వలన మీరే ఒక నిర్ధారణకు వస్తారు..... అప్పుడు మీరు నమ్మేది వాస్తవమా? మేము చెప్పేది వాస్తవమా మీరే తెలుసుకుంటారు. కాబట్టి శరీరం లోపల ఏ అవయవాలు చెడిపోవని గ్రహించండి.
4) గ్రహణం చూస్తే గర్భిణీ స్త్రీలకు / గర్భంలో ఉన్న శిశివుకు హాని జరిగి మొర్రి (పై పెదవి చీలికలు గా ఉండటం) వస్తుందని అని కొందరు భావిస్తారు ఇది సబబేనా?
ఇలా భావించడం సరియైనది కాదు .దానికి సంబంధం లేదు. అలా అయితే ఆ సమయంలో ప్రపంచంలో అనేక మంది పిల్లలు పుట్టిన వారందరికీ రావాలిగా....అలా జరగడం లేదుగా ..
అసలు గ్రహణం చూడటం వల్ల సాధారణ మనుషులతో పాటు, గర్భిణీ స్త్రీలకు గానీ, మరి ఏ ఇతర జీవరాశికి గానీ ఎలాంటి ప్రమాదం సంభవించదు..
ఇలాంటి మూఢ నమ్మకాలు విశ్వసించకుండా చంద్రుడి అద్భుతాలు కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆనందించాలి.
కాని మూఢ నమ్మకాల్లో మునిగిపోయి ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి ఈ ఖగోళ ఘట్టాన్ని చూడండి... ఇతరులకు చూపించండి....
"మూఢ నమ్మకాలను వీడండి - శాస్త్రీయంగా ఆలోచించండి - ఆచరించండి"
జన విజ్ఞాన వేదిక తెలంగాణ సౌజన్యంతో...