శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి దేవస్థానం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అనే గ్రామ సమీపంలో వుంది. ఈ ఆలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఆరణ్య ప్రాంతంలో వెలసిందని చరిత్ర చెబుతుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయానికి ఈ మధ్యనే అనగా 2008 వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ జరిగింది. గర్భాలయంలో స్వామి వారికి వామ భాగాన లక్ష్మి దేవి విలసిల్లి ఉంటుంది. విగ్రహ శీర్ష భాగాన రాతి మకర తోరణం, చుట్టూ దశావతారాలు ఎంతో అందంగా మలచబడి ఉంటాయి.
ఆలయ చరిత్ర..
కొన్ని దశాబ్దాల క్రితం దట్టమైన అటవీ ప్రాంతంలో వున్న ఈ ఆలయంలోకి దోపిడీ దొంగలు చొరబడి, మూల విరాట్ క్రింద నిధి నిక్షేపాలు ఉంటాయని భావించి. మూల విరాట్ ని పీఠం నుండి తొలగించి చూసే సరికి అక్కడ కేవలం శ్రీలక్ష్మీ నృసింహా యంత్రం కనబడిందని వెంటనే ఆ ప్రాంతంలో ప్రళయ నరసింహుడి సింహ గర్జనలు వినిపించాయని దాంతో భయకంపితులయిన ఆ దొంగలు మూల విరాట్ విగ్రహాన్ని ని అతి కష్టం మీద ప్రక్కనే వున్న బావిలోకి జారవిడిచారని చెబుతారు. ఆ తర్వాత స్వామి వారు చాలా మంది భక్తులకు స్వప్నంలో కనిపించి తాను ప్రక్కనే వున్న బావిలో జల రాశుల మధ్య నెలకొని ఉన్నానని తనను తిరిగి ప్రతిష్టించి పూజాధికములు జరిపించమని ఆదేశించెను. పునః ప్రతిష్టించిన నాటి నుండి భక్తుల కోర్కెలు తీర్చే దైవ స్వరూపుడిగా శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారు వెలుగొందుతున్నారు. స్వామి వారి ఆలయ సమీపంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం వుంది. ప్రధాన ఆలయం ప్రక్కన శ్రీ వైష్ణవ మతోద్ధారకులయిన పండిద్దర ఆళ్వార్ల దివ్య సన్నిధానం నెలకొని ఉంటుంది.![]() |
ఈ మధ్యే ప్రారంభించిన ఆలయ స్వాగత తోరణం... |
స్వామి వారి బ్రహ్మోత్సవాలు..
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ సప్తమి నుండి వైశాఖ శుద్ధ పాడ్యమి వరకు శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి బ్రహ్మోత్సవాలు, తొమ్మిది రోజుల పాటు కన్నులపండుగగా జరుగుతాయి. అలాగే ప్రతి సంవత్సరం ధనుర్మాసం చివరి రోజైన భోగిని పురస్కరించుకొని గోదారంగనాయకుల కళ్యాణం ఘనంగా జరుగుతుంది.
ఆలయానికి ఇలా చేరుకోవచ్చు..
కామారెడ్డి బస్ స్టాండ్ నుండి కరీంనగర్ వెళ్ళే బస్సులో చుక్కాపూర్ గ్రామానికి ముందు ఆలయ స్వాగత తోరణం దగ్గర దిగి ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు.శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వీడియో:
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి...
- శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం, సంతాయిపేట్, తాడ్వాయి మండలం, నిజామాబాదు జిల్లా.
- శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, మద్దికుంట, మాచారెడ్డి మండలం