
తెలంగాణ రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ తుది పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నేటి(ఈ నెల 15) నుంచి 21వ తేదీ అర్ధరాత్రి లోపు తమ ప్రవేశపత్రాల(హాల్టిక్కెట్లు)ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలంగాణ పోలీసు నియామక మండలి ఛైర్మన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీన సివిల్, సాయుధ, ప్రత్యేక పోలీసు విభాగాలకు చెందిన కానిస్టేబుల్లతోపాటు అగ్నిమాపకశాఖకు చెందిన ఫైర్మెన్ ఉద్యోగాలకు తుది పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రాథమిక పరీక్ష, దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన హాల్టిక్కెట్లు 15వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి నియామక మండలి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.
రిజిస్ట్రేషన్ నెంబరు, రిజిస్ట్రేషన్ చేసుకున్న చరవాణి నంబరు, ఎస్సెస్సీ, తత్సమాన పరీక్ష హాల్టిక్కెట్టు నంబరు నమోదు చేయడం ద్వారా హాల్టిక్కెట్టు పొందవచ్చని ఆయన వివరించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే support@tslprb.in ద్వారా కానీ 040-23150362, 040-23150462 నంబర్లలో కానీ సంప్రదించాలని సూచించారు.

