నేను...నాన్న
నాకు కొత్త డ్రస్సు వచ్చింది
నాన్న బనీను చిరుగులు
మరింత పెద్దవయ్యాయి
నాకు కొత్త బూట్ల జత వచ్చింది
నాన్న అరిగిపోయిన చెప్పులు
దీనంగా చూస్తున్నాయి
నాకు కొత్త బైకు వచ్చింది
నాన్న డొక్కు సైకిల్
కళతప్పి పక్కన నిల్చుంది
నాకు ఫీజు కట్టేసిన రిసీటందింది
ఎక్కడో అప్పుకై నాన్న చేయి
చాచబడింది...తల దించబడింది..
నెల మొదటి తేదీన కొత్త నోట్లతో
జీతం చేతికందింది
ఎప్పటిదో నాన్న చెమటనంటిన
పాతనోటు వాసనేసింది..
అందమైన ఆనందాలు నిండిన
జీవితం నా సొంతమయ్యింది
కరిగిపోయీ...అరిగిపోయీ
చితికిపోయీ...నాన్న జీవితం
శిథిలమయ్యింది..
అయినా నాకంటే
నాన్న కళ్ళళ్ళోనే విజయోత్సాహం
ఎందుకంటే
నేను నా జీవితాన్ని సాధిస్తే
నాన్న నన్ను సృష్టించాడు
నా జీవితాన్ని తీర్చిదిద్దాడు
నాన్న ఒక త్యాగి... ఒక యోగి
నా బ్రతుకులో వెలుగులు నింపేందుకు
తననంతా.... తన తనువంతా
కరిగించుకున్న ఓ కొవ్వొత్తి..