Welcome to www.manakamareddy.com
Computer Tips and TricksLatest Tips And TricksComputer Tricks

Tuesday, February 07, 2017

Mana Kamareddy

ఇదే రోజు ఛత్రపతి శీవాజి హైదరాబాద్ లోని మహంకాళి ఆలయాన్ని సందర్శించుకున్నారు తెలుసా..


ఈరోజు అనగా ఫిబ్రవరి 7, 1677వ సంవత్సరం ఈ తేదీకో ప్రత్యేకత ఉంది.. సరిగ్గా 340 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ హైదరాబాద్ పాతబస్తీకి వచ్చిన రోజు.. హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ పేరు విన్నా, ఆయన విరోచిత పోరాటాలు, విజయాలు గుర్తుకు వచ్చినా మన రోమాలు నిక్కపొడచుకుంటాయి.. అలాంటి గొప్ప యోధుడు మన భాగ్యనగరానికి వచ్చారనే ముచ్చట ఆసక్తిని కలిగిస్తోంది కదూ.. అయితే శివాజీ యాత్రా విశేషాలను సంక్షిప్తంగా తెలుసుకుందామా?


మొఘల్ సామ్రాట్ ఔరంగజేబ్ గోల్కొండ సామ్రాజ్యంపై కన్నేశాడు.. మరోవైపు ఛత్రపతి శివాజీ తన దండయాత్రలతో ఔరంగజేబ్ కంటిలో నలుసైపోయారు. శత్రువు శత్రుడు మిత్రుడవుతాడనేది యుద్ధనీతి సూత్రం.. అలా శివాజీకి, గోల్కోండ పాలకుడు అబుల్ హాసన్ తానీషాకు మైత్రి కుదిరింది.. ఇందులో మహామంత్రి మాదన్న, శివాజీ రాయబారి నీరజ్ పంత్ కీలకపాత్ర పోశించారు.. 1677 ఫిబ్రవరి మాసంలో 50 వేల మంది సైనిక బలగంతో గోల్కొండకు వచ్చిన ఛత్రపతి శివాజీకి తానీషా ఘన స్వాగతం పలికారు.. ఇరువురి మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.


ఛత్రపతి శివాజీ నెల రోజుల పాటు భాగ్యనగరంలో విడిది చేశారు.. ఫిబ్రవరి 7, 1677 నాడు ఆయన శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకోవడానికి బయలు దేరారు.. శివాజీ తన అశేష సేనావాహినితో పురానాపూల్ వంతెన మీదుగా మూసీనదిని దాటారు.. ఆ తర్వాత చార్మినార్ ద్వారా మొఘల్ పురాలోని మహంకాళీ మందిరానికి వచ్చారు.. ఈ ఆలయంలో ఛత్రపతి శివాజీ చాలాసేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఆలయ పరిసరాలు ‘జై భవానీ, వీర శివాజీ..’ అనే నినాదాలతో మార్మోగాయి..

శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న మహేశ్వరం శివగంగ ఆలయాన్ని కూడా శివాజీ దర్శించారని తెలుస్తోంది.. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శివాజీ, భ్రమరాంబికా దేవీ గర్భాలయంలో ధ్యానమగ్నుడయ్యారు.. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి వీర ఖడ్గాన్ని బహుకరించందని చెబుతారు.. శివాజీ మహరాజ్ శ్రీశైలం ఆలయానికి ఒక రాజగోపురం కూడా నిర్మించారు..


శివాజీ భాగ్యనగర రాకకు గుర్తుగా పూరానాపూల్ దర్వాజాకు ఆయన గుర్రపు నాడాలను బిగించారని స్థానికులు చెప్పుకుంటుంటారు.. శివాజీ సందర్శించిన మహంకాళీ మందిరాన్నిగోల్కొండ మంత్రులు అక్కన్న మాదన్నలు కట్టించారు.. తర్వాత కాలంలో ఈ ఆలయం అక్కన్న మాదన్నల పేరుతోనే ప్రసిద్ధి పొందింది.. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఛత్రపతి శివాజీ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే నేటి తరానికి శివాజీ రాక గురుంచి పెద్దగా తెలియదు.. ఆ మహాయోధున్ని మరోసారి గుర్తు చేసుకోవడానికి ఈ రోజు మంచి సందర్భం..
Article by: Kranti Dev Mitra


Subscribe to this Mana Kamareddy Portal via Email :