మ హి ళా శ క్తి త్ర య దీ ప్తి
గాయత్రీసమభిఖ్య తూరుపుదిశన్ ఖర్వమ్ము లేనట్టిదై
గేయాలాపనలేఖ్యయై శ్రుతిశిరో గీర్వాణవాణీలస
ద్భూయోభూయముగా వెలుంగు కళ తానుద్యత్సవిత్రాత్మయై
మాయంజేయును పాపతామసములన్ మాంజిష్ఠరాగమ్ముతో!
సావిత్రీప్రథితాఖ్య మధ్యనభమున్ సంచారమున్ సల్పుచున్
పావిత్ర్యమ్మొనరించు దేహముల సర్వశ్రేష్ఠమూర్ధన్యయై
ధీవిన్యాససహస్రపద్మమున తా దీపించి దీవించుచున్
ద్యావాభులనేకసూత్రముల సంధానించి స్వచ్ఛప్రభన్!
నాదసరస్వతీమయము నందితలోకము పశ్చిమాశపై
మోదతరంగమాలికల మోహనరాగము సాగుచుండగా
మేదిని వెల్గదే హృదయమీలితసాంధ్యసుధాస్రవంతిలో
హ్లాదమయానురాగసుమరాగపరాగవిలాసహే లలో!
రచన: డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ.